Short story

సంస్కారం నేర్పిన పద్యం

రాజమండ్రిలో ఒక రాత్రి, ఒక ఆటో ప్రయాణం. నడిరోడ్డుపై వదిలేసిన ఒక స్త్రీ, ఒక మూర్ఖుడికి తప్పు తెలియజెప్పిన మార్డ్ పద్యం.

Telugu1 min read

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

ఆ రోజు ఇంకా గుర్తుంది. ఆమె పరిస్థితి తలుచుకుంటే వెన్నులో వణుకు పుడుతుంది. నాకు ధైర్యాన్ని ఇచ్చి, ఒక మూర్ఖుడికి తన తప్పును తెలియజెప్పింది ఒక పద్యం: మార్డ్ (మెన్ ఎగైనెస్ట్ రేప్ అండ్ డిస్క్రిమినేషన్) పద్యం.

రాజమండ్రి · రాత్రి · అండర్‌గ్రౌండ్ జంక్షన్

నేను చాలాసేపటి నుండి ఆటో కోసం ఎదురుచూస్తున్నాను. ఒక ఆటో హార్న్ కొట్టుకుంటూ వచ్చి ఆగింది. నేను ఎక్కి కూర్చున్న వెంటనే ఇంకో ఇద్దరు ఎక్కారు.

ఆటో డ్రైవర్ ఆటో స్టార్ట్ చేస్తుండగా ఒక జంట వచ్చింది. అతడు వేగంగా ఆటోలోకి ఎక్కేశాడు. ఆమె ఎక్కబోతుంటే, “నా వెనక రాకు ఇంక!” అని అరిచేశాడు. ఆమె ఏడుస్తూ, “నన్ను వదిలేసి వెళ్ళొద్దు, ప్లీజ్” అని బతిమాలింది.

ఆటోలో మేమంతా వేడుక చూస్తున్నాం. సినిమా అయితే హీరో వచ్చి కాపాడతాడు, కానీ మాకు అంత ధైర్యం లేదు. ఆటో వాడు ఇంజిన్ ఆఫ్ చేశాడు. ఆమె ఎంతో బతిమాలింది, కానీ వాడు పట్టించుకోలేదు. ఆటోని పట్టుకున్న ఆమె చేతిపై ఒకటి కొట్టి, “పోనీ!” అని ఆటో వాడిపై అరిచాడు.

ఆటో మొదలైంది. నాలో ఏదో తెలియని ఫీలింగ్. అప్పుడు గుర్తొచ్చింది మార్డ్ పద్యం. మరుక్షణం ఆలోచించకుండా ఫోన్‌లో పెట్టాను. నా ఫోన్ సౌండ్ గట్టిగానే వస్తుంది, కాబట్టి ముందు మెల్లగా పెట్టాను. ఈలోపు వాడికి కాల్స్ వస్తున్నాయి. వాడేమో తిట్టుకుంటూ కట్ చేసి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. నేను ధైర్యం చేసి ఇంకో రెండుసార్లు గట్టిగా పెట్టాను.

అలా ఆటో స్టేషన్ చేరుకుంది. వాడూ నేనూ దిగాము. వాడు వెనక రోడ్డు వైపు వెళ్ళి, ఆటో స్టాండ్‌లో ఇంకో ఆటో ఎక్కాడు. నేను వెనకాలే వెళ్ళాను.

ఆ మూర్ఖుడు తిరిగి ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆమె పరిస్థితి భయానకంగా ఉంది. తాగుబోతులు ఆమె దగ్గరగా వచ్చి అల్లరి చేస్తున్నారు. వాడిని చూడగానే ఆమె పరుగున వచ్చి హత్తుకుంది.

పరిస్థితి ఏదైనా, కారణం ఎంత పెద్దదైనా కావచ్చు, ఒక స్త్రీని నడిరోడ్డుపై వదిలి వెళ్ళడం సరికాదు. అసలది మనిషి చేసే పనే కాదు.


ఆ రాత్రి నాకు దారి చూపింది మార్డ్ పద్యం. స్త్రీని మనిషిగా గుర్తించి, ఆమె ఆత్మగౌరవానికి తోడుగా నిలిచి, ఆమెకు రక్షణగా ఉండేవాడే నిజమైన మగాడు అని చెప్పే పద్యం అది.

ఆ పద్యం తెలుగు, హిందీ, మరాఠీ, పంజాబీ భాషల్లో ఉంది. మార్డ్ పద్యం ఇక్కడ వినండి (YouTube)

మహేష్ బాబు, ఫర్హాన్ అఖ్తర్, జావేద్ అఖ్తర్, చంద్రబోస్ గార్లకు ధన్యవాదాలు.

ఈ పద్యం నా ప్రమాణం.